Ambati Rambabu: పేదలను మరింత పేదరికంలోకి నెడుతున్నారు. 5 d ago

AP: చంద్రబాబు సంపద సృష్టి ఏమైందని నిలదీశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్ అని, తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారని, గత ప్రభుత్వ పథకాలకు పాతరేశారని, కొత్త పథకాల ఊసేలేదని మండిపడ్డారు. పీ - 4 అని చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని, ప్రజలందరినీ చంద్రబాబు అడ్వాన్స్‌డ్ ఏప్రిల్ ఫూల్ చేశారని విమర్శించారు. నీతి, నిజాయితీకి మారుపేరు చంద్రబాబు అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, డబ్బులు ఉన్నోడికే మెడికల్ సీట్లు దోచిపెడుతున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయని, ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. చంద్రబాబు తెలివి తక్కువతనం వల్లే పోలవరం ఆలస్యమైందని, తాము ఆ ప్రాజెక్టుపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమే అని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలను పైకి తీసుకురావడమే పేదరిక నిర్మూలన అని, ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం, ఉపాధి కల్పించడం వంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదని మండిపడ్డారు.